తీరని ఆశల కోసం, చేరని గమ్యం కోసం...
నా దారిని వెదుక్కుంటూ
నిన్ను వదలిపోతున్నా
కానీ నీ చెంతే నా మనసు వదలిపోతున్నా
కష్టసుఖాలనన్నీ కలసి పంచుకున్నాం
మాటా మాటా వస్తే తగవులాడుకున్నాం
తెలిసీ తెలియక నేను పొరబాటున ఎపుడైనా
మనసుకు గాయం చేస్తే
మన్నిస్తావనుకుంటూ...
నిన్ను వదలిపోతున్నా
కానీ నీ చెంతే నా మనసు వదలిపోతున్నా
ఏవేవో చేద్దామని కలలు కలిసి కన్నాం
సరదాగా ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం
కంటికి కనిపించనంత దూరంగా భారంగా
మరువలేని గురుతులెన్నొ
పదిలంగా దాచుకుంటూ
నిన్ను వదలిపోతున్నా...
కానీ నీ చెంతే నా మనసు వదలిపోతున్నా...
ఎవరూ విడదీయలేని స్నేహం అనుకున్నాం
ఏనాడూ వీడిపోని బంధం మనదనుకున్నాం
కాలాన్నాపే శక్తి ఏదీ లేదని తెలిసి
మరల రాని నీ తోడు
తెలిసీ చేజార్చుకుంటూ
నిన్ను వదలిపోతున్నా...
కానీ నీ చెంతే నా మనసు వదలిపోతున్నా...
(1996)