Sunday, August 9, 2009

నువ్వున్నావ్


(1998)

ప్రకృతి ప్రమద


(1996)

వసంతం


1994

సంక్రాంతి


(1998)

మలిప్రేమ


(2000)

ఎడబాటు


(1999)

కొందరు


(1998)

వలపు

నన్ను చూడగానె నీ కన్నుల్లో మెరుపు
నాతో మాట్లాడగానె చెక్కిలిపై ఎరుపు
తియ్యని నీ నిట్టూర్పు నీ ఒళ్ళు విరుపు
చూస్తేనే తెలుస్తోంది వలపు మైమరుపు

(1989)

నా దేశం

అంబరాన్ని చుంబించే
హిమగిరి శిఖరం...
వేదఘోష వినిపించే
సాగర కెరటం...
ఈ రెంటి మధ్య వారధి
నా ప్రియ భారతి

(1990)

ఒక్క క్షణం

నిర్దయగా పరుగెత్తే
కాలమా... క్షణమాగు చాలు

దూరమడుగు వేయలేని
పాదాలను ఈడ్చుకుంటూ
దూకబోవు విరహాగ్నికి
ఏకాంతచితిని పేర్చుకుంటూ
నీరుపారు కన్నులను
కొనవేలిన తుడుచుకుంటూ
మసకేసిన చెలిరూపును
మరొక్కసారి చూసుకుంటూ
వీడ్కోలు పలుక వీలుగా

నిర్దయగా పరుగెత్తే
కాలమా... క్షణమాగు చాలు

(1999)

వీడ్కోలు

తీరని ఆశల కోసం, చేరని గమ్యం కోసం...
నా దారిని వెదుక్కుంటూ
నిన్ను వదలిపోతున్నా
కానీ నీ చెంతే నా మనసు వదలిపోతున్నా

కష్టసుఖాలనన్నీ కలసి పంచుకున్నాం
మాటా మాటా వస్తే తగవులాడుకున్నాం
తెలిసీ తెలియక నేను పొరబాటున ఎపుడైనా
మనసుకు గాయం చేస్తే
మన్నిస్తావనుకుంటూ...
నిన్ను వదలిపోతున్నా
కానీ నీ చెంతే నా మనసు వదలిపోతున్నా


ఏవేవో చేద్దామని కలలు కలిసి కన్నాం
సరదాగా ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం
కంటికి కనిపించనంత దూరంగా భారంగా
మరువలేని గురుతులెన్నొ
పదిలంగా దాచుకుంటూ
నిన్ను వదలిపోతున్నా...
కానీ నీ చెంతే నా మనసు వదలిపోతున్నా...


ఎవరూ విడదీయలేని స్నేహం అనుకున్నాం
ఏనాడూ వీడిపోని బంధం మనదనుకున్నాం
కాలాన్నాపే శక్తి ఏదీ లేదని తెలిసి
మరల రాని నీ తోడు
తెలిసీ చేజార్చుకుంటూ
నిన్ను వదలిపోతున్నా...
కానీ నీ చెంతే నా మనసు వదలిపోతున్నా...


(1996)


Friday, August 7, 2009

దేవుడా...

దేవుడా...
ఎందుకు పలకట్లేదు?
నా పిలుపుకు బదులివ్వట్లేదు?

కోటి నామాలతో పిలూ...
వెయ్యి పేర్లు చాలట్లేదు.
ఒక్కటైతే అసలు
వినపడి చావట్లేదు !


Thursday, August 6, 2009

జాతకం

నుదుటి మీద రాతల్లో
చేతుల్లో గీతల్లో
వెతుక్కోకు
నీ బలం

గ్రహ స్థాన గతుల్లో
తారల్లో తిథుల్లో
వెతుక్కోకు
ఏ ఫలం

ఉందంతా చేతల్లో
శ్రమజీవన రీతుల్లో
అలుపెరుగని బాటల్లో
నీ తెలివితేటల్లో

నేను

జంధ్యం వేయని సద్బ్రాహ్మణుడ్ని
నామం పెట్టని శ్రీవైష్ణవుడ్ని
పూజలు చేస్తే లొంగి పోతాడని
భజనలు చేస్తే పొంగి పోతాడని
ఇక ఏం చేసినా చెల్లుతుందని
వంగి వంగి దండాలు పెట్టే
భక్తి పరాయణుల దృష్టిలో ఓ నాస్తికుడ్ని

అజ్ఞేయవాదం నా ప్రవృత్తి
హేతువాదం నాకున్న శక్తి
శాస్త్రీయదృక్పథం నా మార్గం
సమసమాజం నా స్వర్గం
మనిషే దైవం
మమతే దీపం ధూపం నైవేద్యం
మానవతే నా అద్వైతం

అర్థం పర్థం లేని ఆచారాలు నాకసలే పట్టవు
స్వార్ధంతో కూడిన సంప్రదాయాలంటే గిట్టవు
జాడ్యం మౌఢ్యం నాతో ఎపుడూ జత కట్టవు